భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న పీఎం.. మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పూలమాల ఉంచి నివాళులు అర్పించారు. మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు కూడా ఉన్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆయన మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. 28న రాజ్‌ఘాట్‌లో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
కేంద్ర కేబినెట్ సంతాపం
నేడు కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపనున్నట్లు కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఈ రోజు జరగాల్సిన అన్ని అధికారిక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది.








