మధ్యప్రదేశ్ (Madhya Pradesh) క్రికెట్ అసోసియేషన్ (MPCA) అధ్యక్షుడిగా మహాన్ ఆర్యమన్ సింధియా (Mahanaryaman Scindia) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 29 ఏళ్ల వయసులో ఈ పదవి చేపట్టి, ఎంపీసీఏ (MPCA) చరిత్రలోనే అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. సింధియా రాజ కుటుంబానికి చెందిన ఆర్యమన్ ఎన్నికతో, క్రికెట్ పరిపాలనలో ఆ కుటుంబ పట్టు కొనసాగుతోందని మరోసారి స్పష్టమైంది.
సింధియా కుటుంబ వారసత్వం
మహాన్ ఆర్యమన్ సింధియా, దివంగత మాజీ బీసీసీఐ అధ్యక్షుడు మాధవ్‌రావ్ సింధియా మనవడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కుమారుడు. గత మూడేళ్లుగా క్రికెట్ పరిపాలనలో చురుగ్గా ఉన్న ఆర్యమన్, గ్వాలియర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
సింధియా కుటుంబం ఎంపీసీఏపై చాలా కాలంగా తమ పట్టును కొనసాగిస్తోంది. మాధవ్‌రావ్ సింధియా తర్వాత, ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మూడో తరం నుంచి ఆర్యమన్ ఆ పదవిలోకి వచ్చారు. 2010లో మాత్రమే కైలాష్ విజయ్‌వర్గియా జ్యోతిరాదిత్యపై పోటీ చేసి ఓడిపోయారు. లోధా కమిటీ సిఫారసుల కారణంగా జ్యోతిరాదిత్య 2017లో పదవి నుంచి తప్పుకున్నారు.
ఆర్యమన్ క్రికెట్ పరిపాలన
గత ఏడాది కొత్తగా ప్రారంభమైన మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌కు ఆర్యమన్ అధ్యక్షుడిగా వ్యవహరించి, టోర్నీ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. క్రికెట్ పట్ల ఆయనకున్న ఆసక్తి, గత అనుభవం, రాబోయే రోజుల్లో ఎంపీసీఏకు కొత్త దిశానిర్దేశం చేస్తాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.








