దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాలో ప్రతినాయకుడిగా సుదీప్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘బాహుబలి’లో కూడా చిన్న పాత్రలో మెరిశారు. ఇప్పుడు మరోసారి జక్కన్న తన ఆస్థాన నటుడు సుదీప్ కోసం ‘వారణాసి’లో ఒక పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో సుదీప్ పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని, కథను కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్. ఈ చిత్రం కేవలం మహేష్ బాబు సినిమా మాత్రమే కాదు, ఒక భారీ అంతర్జాతీయ మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటోంది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడు సుదీప్ కూడా తోడవడంతో ఈ సినిమా కాస్టింగ్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. దాదాపు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.







