కెన్యాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖతార్‌లో నివసిస్తున్న ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఖతార్ నుంచి 28 మంది ప్రవాస భారతీయుల బృందం విహారయాత్రలో భాగంగా కెన్యాకు వెళ్లింది. కెన్యాలోని నయాందారూ కౌంటీలో ఒల్ జొరోరోక్–నకూరూ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు అక్కడికక్కడే మృతి చెందారు.
నైరోబీలోని భారత హైకమిషన్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాల మార్చరీకి తరలించింది. గాయపడిన వారికి వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. దోహాలోని భారత దౌత్య కార్యాలయం ప్రకారం, బస్సు వక్రంగా తిరుగుతుండగా డ్రైవర్ అదుపు తప్పడంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిలో గీతా షోజి ఐజాక్ (58), జస్నా కుట్టిక్కట్టుచలిల్ (29), రూహి మెహ్రీ ముహమ్మద్ (18 నెలలు), రియా ఆన్ (41), టైరా రోడ్రిగ్స్ (8) ఉన్నారు. ఈ ప్రమాదంలో రియా భర్త జోయెల్, కుమారుడు రవిస్ (14) తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, గాయపడిన ఇతర భారతీయులను సమీప ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.







