తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హైడ్రా (HYDRA) కు అనుబంధంగా తీసుకువచ్చిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) (DRF) సిబ్బంది నిరసన చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad)లోని బుద్ధభవన్ హైడ్రా కార్యాలయంలో డీఆర్ఎఫ్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన దిగారు. జీతాల్లో నుంచి రూ.5 వేల మేర తగ్గించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబగళ్లు శ్రమించి, విపత్తు పరిస్థితుల్లో ముందుండి సేవలందిస్తున్న తమకూ జీతంలో కోత విధించి అవమానపరిచారని ఆరోపించారు.
గతంలో జీహెచ్ఎంసీ(GHMC) ఆధ్వర్యంలోని ఈవీడీఎం (EVDM) విభాగంలో పనిచేసిన ఈ సిబ్బంది ప్రస్తుతం హైడ్రా డీఆర్ఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1100 మంది ఔట్ సోర్సింగ్ (Out Sourcing) సిబ్బంది హైడ్రా పరిధిలో పనిచేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం అందరికీ ఒకే విధంగా జీతాలు చెల్లించాలన్న నిబంధన కారణంగా, ఈనెలలో చాలా మందికి రూ.5000 వరకు జీతం తగ్గిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సగానికి పైగా సిబ్బందికి జీతం తగ్గడంతో వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేము ఇంతకాలం కష్టపడి పనిచేసి, రాత్రి పగలు విపత్తు సమయంలో ప్రాణాలు పెట్టి సేవలందించాం. కానీ ఇప్పుడు మా కష్టానికి ప్రతిఫలం కోత మాత్రమేనా?” అంటూ అధికారులను ప్రశ్నించారు. జీతం సమస్య పరిష్కారం అయ్యే వరకు విధులకు వెళ్లబోమని ప్రకటించారు.








