హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఐపీఎల్ టికెట్ల (IPL Tickets) కేటాయింపులో జరిగిన భారీ ఆర్థిక అక్రమాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కుంభకోణంపై సీఐడీ (CID) దర్యాప్తును వేగవంతం చేసింది. HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు (Jaganmohan Rao) సహా కోశాధికారి శ్రీనివాస్ రావు (Srinivas Rao), CEO సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ (Rajender Yadav), ఆయన భార్య కవితలను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీపై HCA బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారింది. కాంప్లిమెంటరీ టికెట్ల పంపిణీలో అక్రమాలు, బ్యాంకు ఖాతాల నుంచి అనధికారిక నిధుల బదిలీ, ఫోర్జరీ పత్రాల వినియోగం వంటి పలు కీలక విషయాలు విజిలెన్స్ విచారణలో బయటపడ్డాయి. దీని ఆధారంగా సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. విచారణ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మరిన్ని ప్రముఖుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.








