కన్నీటితో టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన కెనడా స్టార్ జెనీ బుచార్డ్

కన్నీటితో టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన కెనడా స్టార్ జెనీ బుచార్డ్

కెనడా టెన్నిస్ స్టార్ (Canada Tennis Star) జెనీ బుచార్డ్ (Jenny Bouchard) తన సొంతగడ్డపై ఓటమితో టెన్నిస్‌ (Tennis)కు వీడ్కోలు పలికారు. మాంట్రియల్‌లో జరిగిన నేషనల్ బ్యాంక్ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో బుచార్డ్ 2-6, 6-3, 4-6 తేడాతో స్విట్జర్లాండ్‌కు చెందిన బెలిండా బెన్‌చిచ్ చేతిలో ఓడిపోయారు.

పోరాడిన బుచార్డ్
తొలి రౌండ్‌లో పోరాడి విజయం సాధించిన బుచార్డ్, రెండో రౌండ్‌లో అదే ఆటతీరును ప్రదర్శించలేకపోయారు. 2 గంటల 16 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ ఓడిపోయిన తర్వాత పుంజుకుని రెండో సెట్ గెలిచారు. అయితే, మూడో సెట్‌లో మంచి పోరాటం చూపించినప్పటికీ కీలక సమయాల్లో బెన్‌చిచ్ ఆధిక్యం సాధించి విజేతగా నిలిచింది.

కెరీర్ అత్యుత్తమ స్థానం
మాంట్రియల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన కెరీర్ ప్రారంభం నుంచే ఈ మైదానంలోనే వీడ్కోలు పలకాలని కలలు కన్నానని బుచార్డ్ చెప్పారు. ఇది చాలా భావోద్వేగమైన సందర్భమని, తన కెరీర్‌లో సాధించినందుకు సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. 2014లో బుచార్డ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానానికి చేరుకున్నారు. అదే ఏడాది ఆమె ఒకే ఒక డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. అదే సంవత్సరం వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె ఆ స్థాయి ప్రదర్శనను కొనసాగించలేకపోయారు.

కన్నీటి పర్యంతం
“ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. టెన్నిస్ ధ్యాసలో పడి చదువుకు, ఇష్టాలకు దూరమయ్యాను. నేను ఆటకు ఎంతో ఇచ్చాను. ఇప్పుడు ఆటకు వీడ్కోలు పలికి ఇతర విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. టెన్నిస్ నాకు తిరిగి ఇచ్చిన వాటితో నేను సంతృప్తిగా ఉన్నాను. చిన్నప్పుడు ఈ మైదానంలో కూర్చొని మ్యాచ్‌లు చూసేదాన్ని. ఏదో ఒక రోజు ఈ కోర్టులో అడుగుపెట్టాలని కలలు కనేదాన్ని. ఇప్పుడు ఆ కలను నిజం చేసుకొని సగర్వంగా ఇక్కడే వీడ్కోలు పలుకుతున్నాను” అని మ్యాచ్ తర్వాత బుచార్డ్ కన్నీటి పర్యంతమయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment