ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలో పర్యటించారు. పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి 2,600 ఏళ్ల చరిత్ర ఉందని, అమ్మవారిని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకమన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన కలియుగ పార్వతీదేవిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారని, అహింస, ఆత్మ త్యాగం, శాంతి, ధర్మ నిరతికి ప్రతిరూపం అమ్మవారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆర్య వైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అమ్మవారిని కొలుస్తారన్నారు.








