సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటన కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని గుర్తుపెట్టుకొని మెసులుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
బుధవారం రాత్రి దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అదే వేడుకకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా వచ్చారు. ముందుగా వచ్చిన అబ్బయ్య చౌదరి కారు చింతమనేని కారుకు అడ్డుగా ఉండటంతో పక్కకు తీయాలని సెక్యూరిటీ కోరాడు. దీంతో అబ్బయ్య చౌదరి డ్రైవర్ కారును పక్కకు తీయగా, ఇంతలో ఆవేశానికి గురైన ఎమ్మెల్యే చింతమనేని.. అబ్బయ్య చౌదరి డ్రైవర్‌పై అసభ్యకరంగా మాట్లాడారు. ఎమ్మెల్యే బూతుపురాణం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఘటనను వివరించేందుకు టీడీపీ కార్యాలయానికి వచ్చిన చింతమనేనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అసభ్య పదజాలం వాడటం ఏ రీతిగానూ సమంజసం కాదని, బూతులు ఉపయోగించడం సరైన విధానం కాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. చింతమనేని ప్రభాకర్‌ను సీఎంను హెచ్చరించడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.








