నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ పూర్తి కానుంది. నిజానికి ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు, కానీ అప్పటికి విడుదల అవుతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెర మీదకు వచ్చింది.
ప్రస్తుతానికి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మించబోతున్న ఈ సినిమా దాదాపుగా పట్టాలెక్కడం ఖాయమే. అయితే ఈ గ్యాప్‌లో దర్శకుడు క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) చెప్పిన కథ నచ్చడంతో బాలకృష్ణ క్రిష్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అద్భుతమైన హిట్‌గా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ అనే సినిమా కథను క్రిష్ బాలకృష్ణకి చెప్పినట్లుగా తెలుస్తోంది. సినిమా కథ బాగా నచ్చడంతో ఆయన వెంటనే సినిమా చేద్దామని చెప్పారని అంటున్నారు. గోపీచంద్ మలినేని సినిమాతో పాటు క్రిష్ సినిమాని కూడా ఒకే సమయంలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ గ్యాప్‌లో మరో సినిమా షెడ్యూల్ ప్లాన్ చేసి రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయానికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.








